సైబర్ నేరాల్లో బ్యాంక్ ఉద్యోగుల పాత్ర
ఖమ్మం జిల్లాలో మరో ముగ్గురు అరెస్ట్
కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్
కాకతీయ, సత్తుపల్లి : సైబర్ నేరాల కేసుల్లో బ్యాంక్ ఉద్యోగుల పాత్ర బయటపడుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకుంటున్నామని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు. సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన సైబర్ నేరాల కేసులో ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితులు ఉడతనేని వికాస్ చౌదరి, బొప్పన నాగప్రియ, సి ఎస్ బి బ్యాంక్ చండ్రుగొండ మేనేజర్ అఖీల్, అబ్ధుల్‌లకు సహకరించినట్లు విచారణలో వెల్లడైందన్నారు. అరెస్టయిన వారిలో చండ్రుగొండ సి ఎస్ బి బ్యాంక్‌కు చెందిన కస్టమర్ రిలేషన్ ఆఫీసర్ ఒర్సు కృప, పెనుబల్లి మండలం బయ్యన్నగూడేనికి చెందిన కస్టమర్ రిలేషన్ ఆఫీసర్ మందా శ్రీహరిబాబు, చండ్రుగొండ మండలం మద్దుకూరుకు చెందిన బ్రాంచ్ ఆపరేషన్ మేనేజర్ జుంజునూరి రాధాక్రిష్ణలు ఉన్నట్లు తెలిపారు. ఈ ముగ్గురు నిందితులను సత్తుపల్లి సీఐ టి. శ్రీహరి అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇదే కేసులో పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని వెల్లడించారు.


