భక్తిశ్రద్ధలతో పెద్దమ్మ తల్లి ఉత్సవాలు
కాకతీయ, రాయపర్తి: పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నారు. మండలంలోని కాట్రపల్లి గ్రామంలో గురువారం పెద్దమ్మ తల్లి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. అర్చకులు, గ్రామ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.
భక్తులు బోనాలు సమర్పిస్తూ మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామమంతా తోరణాలు, విద్యుత్ దీపాలతో అలంకరించడంతో పండుగ వాతావరణం నెలకొంది. పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఆలయానికి రూ.1,00,000 విరాళం అందజేశారు. దూర ప్రాంతాల నుంచి బంధుమిత్రులు తరలిరావడంతో గ్రామంలో సందడి కనిపించింది. మహబూబ్ నగర్ గ్రామానికి చెందిన జర్నలిస్టు కోటేశ్వర్ కుమారుడు సాయి చరణ్ మృతి చెందగా, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారి నివాసానికి వెళ్లి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మునవత్ నరసింహనాయక్, మాజీ ఎంపీపి అనిమిరెడ్డి, మాజీ జెడ్పిటిసి రంగు కుమార్ గౌడ్, పూస మధు, సురేందర్ రాథోడ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


