గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం
*మంత్రి సీతక్క
కాకతీయ, ములుగు ప్రతినిధి:ములుగు జిల్లాలో గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాలని, ప్రతి మహిళను మహిళా సంఘాలలో చేర్చేందుకు కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. గురువారం ములుగు మున్సిపాలిటీలోని 6వ వార్డులో నిర్వహించిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మున్సిపల్ చైర్మన్ చింత నిప్పుల చంద్రకళ బిక్షపతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో 99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గత రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ, వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
నూతనంగా ఏర్పడిన ములుగు మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని, పారిశుద్ధ్య నిర్వహణ కోసం రూ.1.25 కోట్లతో ప్రత్యేక వాహనాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా రూ.50 కోట్లతో సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టం పనులను ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పారిశుద్ధ్య కార్మికులు నిత్యం శ్రమిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నందుకు అభినందనలు తెలుపుతూ, వారి వేతనాల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నదని చెప్పారు. మహిళల సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాలకు రూ.57 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించినట్లు, మరో రూ.43 వేల కోట్ల రుణాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, వివిధ పెన్షన్లు పొందని అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబంలో మహిళ సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. మహిళా సంఘ సభ్యులకు వైద్య పరీక్షల కోసం రూ.5 వేల నుంచి రూ.10 వేల విలువైన సేవలు అందిస్తున్నామని, ప్రతి సభ్యురాలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మహిళా సంఘ సభ్యురాలు రుణం తీసుకుని మరణించిన పక్షంలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నామని, ఇప్పటివరకు రూ.41 కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు వివరించారు. స్త్రీనిధి, ఎస్ ఇ ఆర్ పి సంస్థలు బ్యాంకుల మాదిరిగా సేవలు అందిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


