ప్రేమ వివాహం విషాదాంతం
మొన్న ప్రియుడు.. నేడు ప్రియురాలు ఆత్మహత్య
చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో ఘటన
కాకతీయ, చేర్యాల : ప్రేమ వివాహం చేసుకున్న భార్యభర్తలు ఒకరి వెంట ఒకరు ఆత్మహత్యకు పాల్పడటంతో చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో విషాదం నెలకొంది.సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ముస్త్యాల గ్రామానికి చెందిన అనుముల రాకేష్‌రెడ్డి, తరిగొప్పుల హారిక ఇద్దరు ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో కుటుంబ సభ్యులు అంగీకరించరనే భయంతో ఇరు కుంటుబాలకు తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకున్నారు. కొద్ది రోజులు అలా సాఫీగా సాగుతున్న తరుణంలో కులాలు వేరు కావడం, వివాహ విషయం ప్రియుడి తల్లిదండ్రులకు తెలియడంతో అబ్బాయిని వారి ఇంటికి బలవంతంగా తీసుకెళ్లారు. ప్రేమించిన ప్రియుడు ఎక్కడ దూరమవుతాడో అనే బాధలో హారిక ఆత్మహత్య ప్రయత్నం చేసింది. కోలుకున్న అనంతరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ప్రియుడి తల్లిదండ్రులను పిలిచి స్థానిక పోలీసులు మాట్లాడారు. కొద్ది రోజులు సమయం ఇస్తే పెద్దల సమక్షంలో పెళ్లి చేస్తామని మాట ఇవ్వడంతో అందుకు ఇరు కుటుంబాలు అంగీకరించారు. అయితే ఈ ఒప్పందం జరిగిన కొద్ది రోజులలోనే కుటుంబంలో జరిగిన గొడవలతో కొద్దిరోజుల క్రితం రాకేష్‌రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మూడు రోజుల క్రితం మృతి చెందాడు. భర్త మరణాన్ని తట్టుకోలేని హరిక గురువారం నర్మెట మండలంలోని అమ్మమ్మ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ ఘటన ముస్త్యాల గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషయంపై స్థానిక ఎస్సై గూడ అపూర్వరెడ్డిని సంప్రదించగా అబ్బాయి అమ్మాయి రహస్యంగా పెళ్లి చేసుకున్న మాట వాస్తవమని, అనంతరం ఇరువురు కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చామని, జరిగిన విషయంపై దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. యువకుడి మృతితో ముస్త్యాల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


