ఎస్‌బీఐటీలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ విజయవంతం
కాకతీయ, ఖమ్మం : రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డీఎంహెచ్‌వో రామారావు తెలిపారు. యువత ముందుకు వచ్చి రక్తదానాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ఖమ్మం యస్ బి ఐ టి కళాశాలలో ఆరోహన్ వార్షికోత్సవంలో భాగంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. డీఎంహెచ్‌వో రామారావు మాట్లాడుతూ ఒక యూనిట్ రక్తంతో ముగ్గురు వ్యక్తులను కాపాడవచ్చని తెలిపారు. అరవై సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని చెప్పారు. మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వివరించారు. అపోహలను నమ్మకుండా రక్తదానాన్ని ఉద్యమంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా జి ధాత్రి స్వయంగా రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించారు. కళాశాల ఛైర్మన్ గుండాల కృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు సేవాభావంతో ముందుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో డా రాజశేఖర్, డా రాజేశ్వర్, నరేందర్, యన్ సందీప్, కె శ్రీచైతన్య, డా జి రాజ్ కుమార్, గుండాల ప్రవీణ్ కుమార్, గంధం శ్రీనివాసరావు, డా ఎ వి వి శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


