సాగునీరు వెంటనే విడుదల చేయాలి
డీబీఎం 38 కెనాల్ గేట్లు తెరవాలి
దుగ్గొండి మండల రైతుల నిరసన
కాకతీయ, వరంగల్ బ్యూరో : డీబీఎం 38 కెనాల్ గేట్లను తెరిచి సాగునీరును విడుదల చేయాలని దుగ్గొండి మండల రైతులు డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పది రోజులపాటు నీరు వదిలితే పంటలు నిలబడతాయని తెలిపారు. దుగ్గొండి మండలానికి చెందిన రైతులు గీసుగొండ వద్ద ఉన్న డీబీఎం 38 కెనాల్ గేట్ల వద్దకు చేరుకుని రైతులు నిరసన వ్యక్తం చేశారు. వెంకటాపురం, దుగ్గొండి, దేశాయిపల్లి, తొగరురామయ్యపల్లి, మైసంపల్లి, గుడి మహేశ్వరం, లక్ష్మీపురం గ్రామాలకు చెందిన రైతులు నిరసనలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ దాదాపు 200 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న, వరి పంటలు నీరు అందక ఎండిపోతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా సాగునీరు విడుదల చేయకపోతే పూర్తిగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పారు. పెట్టుబడి కూడా తిరిగి రాకపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదాకు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో రైతులు సంపత్, రమణ, రవి, కుమారస్వామి, రాజయ్య, నారాయణ, బాపురావు, నర్సయ్య, అనంతం, ఐలయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


