రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానం
హ్యామ్ మోడల్ రోడ్లకు రూ. 13 వేల కోట్లతో టెండర్లు
రూ. 13 వందల కోట్లు ముందే ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం
జేఇంఫ్రా, బృందా ఇంఫ్రా కంపెనీలకు టెండర్లు!
కాకతీయ, తెలంగాణ బ్యూరో : రోడ్ల అభివృద్ధి పేరిట తీసుకొస్తున్న కొత్త విధానం హ్యామ్ రోడ్స్ లో రూ.8 వేల కోట్ల స్కాం జరుగుతుందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 6 వేల కిలోమీటర్ల హ్యామ్ మోడల్ రోడ్లకు రూ. 13 వేల కోట్లతో టెండర్ల పిలిచి మొబిలైజేషన్ క్రింద 10 శాతం రూ. 13 వందల కోట్లు ముందే ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యిందని ఆరోపించారు. ఈ టెండర్‌లో ఎక్సెస్ టెండర్ వేసుకోవాలని ప్రభుత్వమే సలహాలు ఇవ్వడం దారుణమని వెల్లడించారు. హ్యామ్ మోడల్ రోడ్ల విషయంలో ప్రభుత్వం మరోసారి రివ్యూ చేసుకోవాలని సూచించారు. ఈ రోడ్లను జేఇంఫ్రా, బృందా ఇంఫ్రా కంపెనీలకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ కంపెనీలు ఆర్‌అండ్‌బీ లో పనులు చేసిన దాఖలాలు లేవని ఆరోపించారు. దీనిపై విజిలెన్స్ కు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీలు జోక్యం చేసుకొని హ్యామ్ మోడల్ రోడ్లలో జరుగుతున్న అవినీతిని కాపాడాలి, లేదంటే బీజేపీకి ఇందులో భాగస్వామ్యం ఉందని భావించాల్సి వస్తుందని అన్నారు.
బీఆర్ఎస్ హయాంలో రూ. 25వేల కోట్లు ఖర్చు
రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని ఆరోపించారు. గడిచిన రెండున్నరేళ్ల కాలంలో కాంగ్రెస్ కనీసం మరమ్మతులు చేపట్టడం లేదని తెలిపారు. పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బీ రోడ్లు మోకాలు లోతు గుంతలు పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్మూరు నుంచి భీంగల్ పోయే రోడ్డు, రెండు నియోజకవర్గాలకు మధ్య పెద్ద బ్రిడ్జి కూలిపోతే రిపేర్ చేయలేదని ఆరోపించారు. బడ్జెట్‌లో కేటాయింపులుంటున్నా నిధులు కేవలం 25శాతం మాత్రమే చేస్తున్నారని విమర్శించారు. అధికారులు ఆర్ అండ్ బీ నిధులు ఖర్చు చెయ్యడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ వైఖరి వల్ల రోడ్ల మరమ్మతులకు,నిర్మాణాలకు కొత్తగా కాంట్రాక్టర్లు రావడం లేదని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో రోడ్ల కోసం రూ. 25వేల కోట్లు ఖర్చు చేసిందని, దాదాపు ప్రతి సంవత్సరం 2, 600కోట్లు యావరేజ్‌న విడుదల చేశామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.4వేల కోట్లు చేయాల్సి ఉండగా కేవలం రూ. 1,200కోట్లు విడుదల చేయడంతో రోడ్లు ఇంత అధ్వాన్నంగా తయ్యారయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర కాలంలో 2 ,070 కిలోమీటర్ల పనులు శాంక్షన్ అయితే 112 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేశారని దుయ్యబట్టారు. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పాతవి , కొత్తవి కలిపి 300 కిలోమీటర్ల పని మాత్రమే చేశారని వెల్లడించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించగా సందర్శనకు అనుమతులివ్వక పోవడం శోచనీయమని అన్నారు.


