మాది ప్రజా ప్రభుత్వం.. ప్రతి గింజ కొంటాం
నెల్లికుదురుకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు
ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్
కాకతీయ, నెల్లికుదురు : నెల్లికుదురు మండల కేంద్రానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరైనట్లు ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సహకారంతో ఈ పాఠశాల మంజూరు సాధ్యమైందన్నారు. బుధవారం మండల కేంద్రంలో మార్క్‌ఫెడ్, పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతిగా నిలుస్తుందని, రైతులు పండించిన ప్రతి మొక్కజొన్న గింజను కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.
రైతులకు భరోసా.. అభివృద్ధికి ప్రాధాన్యం..!
నెల్లికుదురులో ప్రభుత్వ పాఠశాల స్థలంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు ద్వారా సుమారు 1500 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని తెలిపారు. మొక్కజొన్నకు క్వింటాల్‌కు రూ.2,400 మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. తేమ శాతం 14% ఉండే విధంగా పంటను సిద్ధం చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. అన్నదాతలకు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాలు, తండాల్లో నీటి ఎద్దడి లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మహబూబాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం దృష్టి సారించాలని కోరినట్లు చెప్పారు. ఇప్పటికే గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రహదారులు నిర్మించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పులి వెంకన్న, తహసీల్దార్ చంద నరేష్, పిఎసిఎస్ ప్రతినిధులు జె. మనోహర్ రావు, సెక్రటరీ యాదగిరి, ఏఎంసీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


