వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ
కాకతీయ,చేర్యాల: అయ్యప్ప స్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చేర్యాల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఆలయ కమిటీ అధ్యక్షులు తాటిపెల్లి ఆంజనేయులు గుప్త ఆధ్వర్యంలో వేద పండితులు చైతన్య శర్మ, నాగరాజ్ శర్మ, రాజు శర్మ వేద మంత్రోచరణల మధ్య పడిపూజ ఘనంగా నిర్వహించారు.ఉదయం అయ్యప్ప స్వామి అభిషేకం,గణపతి పూజ, పుష్పార్చన, మంత్ర పూజ కార్యక్రమాలతో పాటు స్వామి వారికి ఎంతో వైభోపేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి ఆలయం నుంచి మంగళ వాయిద్యాలు, అయ్యప్ప భక్తుల శరణ ఘోషతో ఆలయం ఆవరణలో అయ్యప్ప స్వామి వారి పల్లకి సేవ నిర్వహించారు. స్వామియే శరణం అయ్యప్ప.. శరణంశరణం అయ్యప్ప.. స్వామి శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆలయం మార్మోగింది. ఈ మహపడిపూజ మహోత్స వానికి పెద్దఎత్తున భక్తులు పాల్గొని అయ్యప్ప నామస్మర ణం, భజన పాటలు, భక్తి గీతాలను ఆలపించారు.వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేయగా భక్తులు పెద్ద ఎత్తున స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.




