చైర్ పర్సన్,వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ
•రెండుసార్లు వాయిదా తరువాత జరగనున్న ఎన్నిక
•ఈసారైనా మీడియాను అనుమతిస్తారా..?
కాకతీయ, రామకృష్ణాపూర్ : అనేక వివాదాల నడుమ వాయిదా పడిన క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్,వైస్ చైర్మన్ ఎన్నికపై పుర ప్రజల్లో ఇంకా ఉత్కంఠ నెలకొంది. అన్ని మున్సిపాలిటీలతో పాటు జరిగిన చైర్ పర్సన్,వైస్ చైర్మన్ ఎన్నిక ఇక్కడ మాత్రం రెండు సార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో వాయిదా పడిన విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి ప్రత్యేక అధికారి తీసుకెళ్లారు. అయితే మెజారిటీ స్థానాలు సాధించిన బీఆర్ఎస్ & సీపీఐ మాత్రం చైర్ పర్సన్,వైస్ చైర్మన్ ఎన్నిక జరిపించాలని హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పరిశీలించిన హై కోర్ట్ మూడు,నాలుగు వారాల లోగా ఎన్నిక నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఏప్రిల్ 4 న ఎన్నిక నిర్వహించాలని నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లను మున్సిపల్ అధికారులు చేస్తున్నారు. ఇప్పటికే గెలుపొందిన కౌన్సిలర్ అభ్యర్థులకు ఎన్నిక తేదీ,సమయం తో కూడిన నోటీసులను అందిస్తున్నారు. చూడాలి మరి ఈసారైనా ఎన్నిక సజావుగా జరుగుతుందా..? లేదా..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మారింది.
#వాయిదా తరువాత జరగనున్న ఎన్నిక.
అధికార పార్టీ కాంగ్రెస్,ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మిత్ర పక్షం సీపీఐ పార్టీతో పొత్తు పెట్టుకొని మరి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసింది. ఎన్నికల ఫలితాలో మాత్రం అధికార పార్టీ కాంగ్రెస్ 7 స్థానాలు సాధించగా,ఇండిపెండెంట్ తో కలిపి 8 కి చేరింది. కాగా బీఆర్ఎస్ 10 సీపీఐ 4 స్థానాలు సాధించాయి. మొత్తంగా 14 స్థానాలతో చైర్ పర్సన్,వైస్ చైర్మన్ కుర్చీలను కైవసం చేసుకోబోతోంది. అయితే అనేక వివాదాల నడుమ వాయిదా పడిన ఎన్నిక ఇప్పుడైనా సజావుగా జరుగుతుందా అనే వాదనలు ఓటేసిన ప్రజల నుంచి బాహాటంగానే వినిపిస్తున్నాయి. కాగా క్యాంప్ బాట పట్టిన 14 మంది కౌన్సిలర్లు ఇప్పటివరకు క్యాతన్ పల్లికి రాకపోవడం చెప్పుకో దగ్గ విషయమే.
#ఈసారైనా మీడియాను అనుమతిస్తారా..?
మొన్న జరిగిన క్యాతన్ పల్లి మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం,చైర్ పర్సన్,వైస్ చైర్మన్ ఎన్నిక సమయంలో అక్కడి అధికారులు మీడియాను అనుమతించలేదు. దీంతో కార్యాలయం గేటు ముందు నుంచే ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు వేచి చూడాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. కనీసం ఎన్నిక కవరేజీ కొరకు వచ్చిన మీడియా ప్రతినిధులకు మంచినీరు,కుర్చీలు ఏర్పాటు చేయకుండా స్థానిక మున్సిపల్ కమిషనర్ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఈసారైనా జరిగే చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికకు మీడియా ప్రతినిధులను కవరేజీ కొరకు సమావేశమందిరంలోకి అనుమతిస్తారా..? లేదా నిరాకరిస్తారా..? అనేది చూడాల్సిందే.


