అంతః రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్
ఒంటరి మహిళలే లక్ష్యంగా ముఠా దాడులు
వరంగల్ పోలీసుల నిఘాతో చిక్కిన నిందితులు
పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అభినందన
కాకతీయ, హనుమకొండ : ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన పలు చోరీలకు తెరపడింది. తమిళనాడుకు చెందిన కళ్యాణ సుందరం, సెల్వరాజ్ అనే ఇద్దరు నిందితులను వరంగల్ సీసీఎస్, హనుమకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వరంగల్‌కు వచ్చి మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ చోరీ చేసి, అదే వాహనంతో తిరుగుతూ ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని వరుసగా చోరీలు చేసినట్లు పోలీసులు తెలిపారు. సుబేదారి, హనుమకొండ, కేయూసీ ప్రాంతాలతో పాటు కర్నూల్‌లో కూడా ఘటనలు జరిపినట్లు గుర్తించారు. సీసీటీవీ, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి నిఘా పెట్టిన పోలీసులు హనుమకొండ బస్ స్టాండ్ సమీపంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. పారిపోవడానికి ప్రయత్నించినప్పటికీ వెంటాడి పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌లో ప్రతిభ కనబరిచిన పోలీస్ బృందాన్ని పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అభినందించారు. డీసీపీ దారా కవిత ఆధ్వర్యంలో బృందం కీలక పాత్ర పోషించింది.


