డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన
అంబేద్కర్ కూడలిలో ధర్నా.. ట్రాఫిక్‌కు అంతరాయం
ప్రైవేట్ పాఠశాలల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన
కాకతీయ, హుజురాబాద్ : డంపింగ్ యార్డ్ ఏర్పాటును వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. పర్యావరణానికి ముప్పు తలెత్తుతుందని, ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలని కోరారు. బుధవారం పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో ప్రైవేట్ పాఠశాలల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని నినాదాలు చేశారు. విద్యార్థులు మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ వల్ల గాలి, నీటి కాలుష్యం పెరుగుతుందని అన్నారు. అనారోగ్య సమస్యలు అధికమయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా విమర్శించారు. ధర్నా కారణంగా అంబేద్కర్ కూడలి పరిసర ప్రాంతాల్లో గంటల పాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.


