డంపింగ్ యార్డ్ రద్దు చేయాలి
హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
ఆందోళనలకు సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే
కాకతీయ, హుజురాబాద్: హుజురాబాద్ మండలం సిర్సపల్లి శివారులో ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని రద్దు చేయాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. ప్రజల ఆకాంక్షలను గౌరవించి ప్రభుత్వం తక్షణం నిర్ణయం తీసుకోవాలని కోరారు. హుజురాబాద్ మండలం సిర్సపల్లి శివారులో ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళనలు, దీక్షలకు బుధవారం ఆయన సంఘీభావం తెలిపారు. స్థానిక జేఏసీ నాయకులతో మాట్లాడారు. ఈసందర్భంగా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ నిర్మాణం జరిగితే వాతావరణ కాలుష్యం పెరుగుతుందని అన్నారు. ఇతర మున్సిపాలిటీల నుంచి చెత్త తరలింపుతో సమస్య మరింత తీవ్రమవుతుందని తెలిపారు. ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటైతే కాలుష్యాన్ని నియంత్రించడం కష్టమని చెప్పారు. దుమ్ము, ధూళి పెరిగి రైతుల భూముల విలువలు తగ్గే ప్రమాదం ఉందన్నారు. పిల్లలు, మహిళలు, వృద్ధుల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారని తెలిపారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తాను కూడా త్వరలో దీక్షలో పాల్గొంటానని వెల్లడించారు.


