గ్రామసభలతో ప్రజాపాలన బలోపేతం
ఏప్రిల్ 2న గ్రామ, వార్డు సభలు నిర్వహించాలి
పథకాల వివరాలు ప్రజలకు చేరవేయాలి
లబ్ధిదారులతో నేరుగా మాట్లాడాలి
ప్రజా ప్రతినిధుల హాజరు తప్పనిసరి
సభల ద్వారా అవగాహన పెంచాలి
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
కాకతీయ, వరంగల్ బ్యూరో : ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక అమలుకు గ్రామ సభలే వేదిక అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వ పథకాల వివరాలు ప్రజలకు చేరేలా గ్రామ, వార్డు సభలను సమగ్రంగా నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2న సభలను విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ గ్రామ సభల ద్వారా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను స్పష్టంగా ప్రజలకు వివరించాలని అన్నారు. గ్రామపంచాయతీలకు వచ్చిన నిధులు, వాటి వినియోగంపై వివరాలు తెలియజేయాలని సూచించారు. జీవన బీమా పథకం, పాఠశాల విద్యార్థులకు అల్పాహారం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంటి పథకాల వివరాలను ప్రజలకు చెప్పాలని అన్నారు.

లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడాలి
రైతు భరోసా, ఉచిత విద్యుత్, వ్యవసాయ బోర్లు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం వంటి పథకాల లబ్ధిదారులతో నేరుగా మాట్లాడాలని సూచించారు. ప్రజల అభిప్రాయాలను సేకరించి వాటిని పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. గ్రామ సభ ప్రారంభానికి ముందు రాష్ట్ర గీతం ఆలపించి, ముఖ్యమంత్రి సందేశాన్ని చదవాలని తెలిపారు. అనంతరం పథకాల వివరాలను వినిపించాలని సూచించారు. ప్రజా ప్రతినిధులను తప్పనిసరిగా ఆహ్వానించాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు మాట్లాడుతూ గ్రామ, వార్డు సభల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. సభలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులతో సమావేశమై గ్రామ, వార్డు సభల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి సభలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్ రవి, డీఆర్డీవో మేన శ్రీను, జడ్పీ సీఈఓ శేషాద్రి, డీపీవో లక్ష్మీ రమాకాంత్, డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.


