నాణ్యమైన ఆహారం తప్పనిసరి
కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్
పాఠశాలల్లో సదుపాయాలపై కలెక్టర్ ఆగ్రహం
కాకతీయ, కొత్తగూడెం : విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, మౌలిక సదుపాయాల్లో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. మెనూ ప్రకారం పోషకాహారం తప్పనిసరిగా అందించాలని ఆదేశించారు. మంగళవారం జూలూరుపాడు మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం అండ్ జూనియర్ కళాశాల, పడమటి నర్సాపురం గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల విద్యా స్థాయి, ఆహార నాణ్యత, తాగునీటి సదుపాయాలు, మౌలిక వసతులపై సమగ్రంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కిచెన్, డైనింగ్ హాల్ పరిశీలించిన కలెక్టర్ మెనూ ప్రకారం ఆహారం అందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కుళ్లిన కూరగాయలు నిల్వ ఉంచడాన్ని తీవ్రంగా ఖండించారు. తాజా కూరగాయలతోనే వంటలు చేయాలని ఆదేశించారు. పనిచేయని ఆర్ ఓ ప్లాంట్, బయోమెట్రిక్ యంత్రాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. అనవసర ఖర్చులను తగ్గించి విద్యార్థుల సౌకర్యాలకు వినియోగించాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో తహాసిల్దార్ శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


