గ్రామాభివృద్ధియే మా లక్ష్యం
: సర్పంచ్ గుగులోత్ సుజాత సంతోష్ నాయక్
కాకతీయ, కారేపల్లి:- గ్రామాభివృద్ధియే మా లక్ష్యమని సర్పంచ్ గుగులోత్ సుజాత సంతోష్ నాయక్ తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ నిధులను ప్రజల అవసరాలకు వినియోగిస్తున్నామని వెల్లడించారు. మంగళవారం పాటిమీద గుంపు గ్రామపంచాయతీలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పనులకు కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. గుగులోత్ సుజాత సంతోష్ నాయక్ మాట్లాడుతూ గ్రామంలో అంతర్గత రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. బురద రోడ్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని స్పష్టం చేశారు. బచ్చేలా బుజమ్మ, బచ్చేలా భాస్కర్ ఇంటి వరకు 3 లక్షలు, బానోత్ రాములు ఇంటి నుండి నాగ ఇంటి వరకు 7 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మంజుల, వార్డు సభ్యులు విజయ, ఈసం రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


