కాకతీయ పెద్దపల్లి: అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా అదనపు కలెక్టర్ డి.వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లాగలమర్రి గ్రామానికి చెందిన గొర్రె సునీల్ నంది మేడారంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల విద్యాలయంలో ఆరవ తరగతిలో సీటు ఖాళీగా ఉన్నందున ఆ సీటు తన కూతురు గొర్రె సమన్వితకు కేటాయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఎస్సి శాఖ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు.
గోదావరిఖని నగరం శాద్ నగర్ కు చెందిన ఎం. శేషగిరి రావు తనకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పీడీ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గోదావరిఖని జవహర్ నగర్ కు చెందిన షహీదా బేగం తనకు ఎక్కడైనా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా వారధి సోసైటీకి రాస్తూ అవకాశం అర్హత మేరకు చర్యలు తీసుకోవాలన్నారు.
అంతర్గాం మండలం కుందనపల్లి గ్రామానికి చెందిన సుంకరి రవీందర్ తన కరెంట్ బిల్లులో ఎస్.రవీందర్ కు ఏ.రవీందర్ అని వస్తుందని తన పేరును మార్పు చేయాలను కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఎస్.ఈ ఎలక్ట్రిసిటీకి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


