ఎన్‌ఫోర్స్మెంట్ చర్యలు కట్టుదిట్టం చేయాలి
నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
కాకతీయ, హనుమకొండ : నేరాల నియంత్రణకు ఎన్‌ఫోర్స్మెంట్ చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం కాకతీయ మెడికల్ కళాశాలలో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడారు. సమావేశంలో పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
నేరాల నియంత్రణపై దిశానిర్దేశం
అక్రమ ఇసుక రవాణా, గుట్కా విక్రయాలు, రేషన్ బియ్యం అక్రమ రవాణా, పేకాట, బెట్టింగ్ కార్యకలాపాలను కట్టడి చేయాలని ఆదేశించారు. శివారు ప్రాంతాల్లో నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. చోరీలకు పాల్పడే నేరస్థులపై హిస్టరీ షీట్లు తెరవాలని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటు వేగవంతం చేసి జియోట్యాగింగ్ చేయాలని సూచించారు. గంజాయి సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. హనుమాన్ జయంతి వేడుకలు ప్రశాంతంగా జరిగేలా ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీసీపీలు అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్, కవిత, జనగామ ఏఎస్పీ చేతన్, ట్రైనీ ఐపీఎస్ మనీషా నెహ్ర, అదనపు డీసీపీలు ప్రభాకర్, రవి, బాలస్వామి, శ్రీనివాస్, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్ ఐలు, ఎస్ ఐలు పాల్గొన్నారు.


