మీ సేవలు ఎందరికో ఆదర్శం
కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్
పదవీ విరమణ పొందిన అధికారులకు ఘన సత్కారం
కాకతీయ, కొత్తగూడెం:- మీ సేవలు ఎందరికో ఆదర్శమని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. పోలీస్ శాఖలో దీర్ఘకాలంగా పనిచేసి ప్రజలకు సేవలందించిన అధికారుల అనుభవాలు కొత్తగా చేరిన సిబ్బందికి మార్గదర్శకమని తెలిపారు. పదవీ విరమణ అనంతరం కుటుంబంతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో పదవీ విరమణ పొందిన అధికారులను సత్కరించారు. శాలువాలు, పూలమాలతో ఘనంగా సన్మానించారు. రోహిత్ రాజు మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన అధికారులు తమ అనుభవాలను పంచుకోవాలని సూచించారు. సమస్యలు ఎదురైతే వెంటనే తెలియజేయాలని అన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, వ్యాయామం, యోగా, ధ్యానం అలవాటు చేసుకోవాలని సూచించారు. కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేసి పదవీ విరమణ పొందిన ఎస్సై మీర్జా కమల్షా బేగ్, దమ్మపేట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తించిన ఎస్సై వంక రామరాఘవయ్య, జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పనిచేసిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ పరిశిక మల్లికార్జున రావు లను సత్కరించారు. వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మంజ్యా నాయక్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు, ఎంటిఓ సుధాకర్, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణ, జిల్లా పోలీస్ అధికారుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


