చెల్లింపుల్లేకపోతే స్పాట్ కేంద్రాల్లో నిరసన
పారుపల్లి నాగేశ్వరరావు జిల్లా ప్రధాన కార్యదర్శి టీఎస్ యుటీఎఫ్
కాకతీయ, బోనకల్:చెల్లింపులు చేయకుంటే స్పాట్ కేంద్రాల్లో నిరసనలు చేపడతామని టీఎస్ యుటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు తెలిపారు. ఎస్ ఎస్ సి స్పాట్ వాల్యుయేషన్ రెమ్యూనరేషన్, కుల గణన రెమ్యూనరేషన్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏప్రిల్ 1 నుంచి ఆందోళనలు ప్రారంభమవుతాయని హెచ్చరించారు. బోనకల్ మండల కేంద్రంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. టి టి జేఏసీ, యూఎస్ పిసి, జే ఏ సి టి ఓ, జే ఏ సి ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు. పారుపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ 2025 ఎస్ ఎస్ సి స్పాట్ నిర్వహించిన ఉపాధ్యాయులకు ఇంకా రెమ్యూనరేషన్ ఇవ్వలేదన్నారు. 2024లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయులు, ఉద్యోగులకు కూడా పారితోషికం ఇవ్వలేదని అన్నారు. ఈ అంశంపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సుల్తానియాకు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. పెండింగ్ లో ఉన్న 5 డీఏలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు అన్ని క్లియర్ చేయాలని కోరారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వారికి స్పాట్ విధుల్లో మినహాయింపు ఇవ్వాలని తెలిపారు. ఈ సమావేశంలో యుటీఎఫ్ జిల్లా అధ్యక్షులు షేక్ రంజాన్, జిల్లా కోశాధికారి వల్లంకొండ రాంబాబు, జిల్లా కార్యదర్శులు షేక్ ఉద్దండు షరీఫ్, గుగులోతు రామకృష్ణ, పి సురేష్, సీనియర్ నాయకులు జి రాజశేఖర్, ఎన్ వీరబాబు, జానీమియా తదితరులు పాల్గొన్నారు.


