కౌశిక్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలి
కడియం శ్రీహరి పట్ల అసెంబ్లీలో అనుచిత ప్రవర్తనపై సిరాజ్ హుస్సేన్ ఆగ్రహం
కాకతీయ, కరీంనగర్ : హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ హుస్సేన్ విమర్శించారు. సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల ఆయన ప్రవర్తించిన తీరు దారుణమని పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం ఈ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తూ సిరాజ్ హుస్సేన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి వ్యక్తులు శాసనసభలో ఉండటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రజల సమస్యలు చర్చించే పవిత్ర వేదిక అయిన అసెంబ్లీలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన స్థానంలో ఉండి అనుచితంగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. సీనియర్ నేత కడియం శ్రీహరిని హావభావాలతో కించపరచడం సరైనది కాదని పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కౌశిక్ రెడ్డికి అలవాటైందని విమర్శించారు. గతంలో గవర్నర్ తమిళిసైపై చేసిన వ్యాఖ్యలు, ఇటీవల సీపీ గౌష్ ఆలం పై చేసిన వ్యాఖ్యలు కూడా ఇదే ధోరణిని చూపుతున్నాయని అన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకులు నైతిక విలువలు పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా ఉండాలని, ఇటువంటి ఘటనలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని, ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నారని, ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని సిరాజ్ హుస్సేన్ పేర్కొన్నారు.


