అక్రమ ఇసుక రవాణా బట్టబయలు
ట్రాక్టర్లు సీజ్.. నిందితులపై కేసులు నమోదు
కాకతీయ, కరీంనగర్ రూరల్: మానేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలింపుపై కరీంనగర్ రూరల్ పోలీసులు దాడులు నిర్వహించి ట్రాక్టర్లను సీజ్ చేశారు. గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ అక్రమ రవాణా బయటపడింది. మందులపల్లి గ్రామానికి చెందిన శివరాత్రి అభిలాష్, మొగ్దుంపూర్కు చెందిన దుర్గం మహేష్ ఆదేశాల మేరకు ఇసుక తరలిస్తుండగా బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఇదే సమయంలో సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన అలవేణి సంతోష్, గట్టేపల్లి గ్రామానికి చెందిన అంబాల శ్రవణ్ కుమార్లు ఇసుకను దొంగలించి రవాణా చేస్తుండగా బొమ్మకల్ లారీ అసోసియేషన్ చౌరస్తా వద్ద అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ట్రాక్టర్లను సీజ్ చేసి నిందితులపై కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించారు. పునరావృతంగా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, సస్పెక్ట్ షీట్లు తెరిచి నిఘా పెంచుతామని సీఐ ఎ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. సీజ్ చేసిన వాహనాలను ఎంఆర్ఓకు అప్పగించి వేలం వేయనున్నట్లు తెలిపారు.


