ఖబడ్దార్ జీవన్ రెడ్డి
పార్టీని మోసం చేసి రూ.500 కోట్లు సంపాదించుకున్నావ్
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం ఆరోపణలు
జీవన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు
కాకతీయ, కరీంనగర్ : వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయాలను వాడుకున్నారని, పార్టీని మోసం చేసి భారీగా సంపాదించుకున్నావని జీవన్ రెడ్డిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం తీవ్ర ఆరోపణలు చేశారు. ఇకపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో కాంగ్రెస్ నాయకులు సముద్రాల అజయ్, గడ్డం నాగరాజుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్జల కాంతం మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డిని నాలుగు దశాబ్దాల పాటు ఆదరించి ఎదిగేలా చేసిందని తెలిపారు. అయితే పార్టీకి ఆయన చేసిన సేవలు ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. జగిత్యాల నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి చేసిన కృషి ఏమిటో వివరించాలని డిమాండ్ చేశారు.
పార్టీపై విమర్శలు సరైంది కాదని హెచ్చరిక
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులను ఎంతమందిని గెలిపించావో చెప్పాలని నిలదీశారు. కుటుంబ సభ్యుల అభివృద్ధికే పరిమితమై పనిచేశావని ఆరోపించారు. బీసీ, ఎస్సీ, మైనారిటీలు, అగ్రకులాల పేదల కోసం చేసిన సేవలు ఏమిటో వెల్లడించాలని కోరారు. కాంగ్రెస్ ద్వారా ఎదిగిన నీవు అదే పార్టీపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేయడం అనైతికమని పేర్కొన్నారు. సుద్దాల దేవయ్యను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చింది కూడా జీవన్ రెడ్డేనని గుర్తుచేశారు. ఒక మీడియా ఛానల్ ద్వారా తనపై దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చేతులు కలిపి పార్టీని మోసం చేసి 500 కోట్లు సంపాదించుకున్నావని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇకపై రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే సహించేది లేదని గజ్జల కాంతం హెచ్చరించారు.


