ప్రజావాణి వద్ద జన సందోహం
గంటల తరబడి క్యూలో నిల్చొని వినతుల సమర్పణ
పెన్షన్, భూ సమస్యలతో భారీగా హాజరు
కాకతీయ, కరీంనగర్ : తమ సమస్యల పరిష్కారంపై ఆశతో ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రజావాణికి తరలివచ్చి గంటల తరబడి క్యూలో నిల్చొని వినతులు సమర్పించారు. కరీంనగర్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీగా హాజరయ్యారు. ఉదయం నుంచే క్యూ లైన్లలో నిల్చొని అధికారులు వినతులు స్వీకరించే వరకు సహనంతో ఎదురుచూశారు. పెన్షన్లు, భూ వివాదాలు, పథకాల అమలు, ఆదాయ ధృవపత్రాలు వంటి అనేక సమస్యలతో ప్రజలు వినతిపత్రాలు సమర్పించారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు కూడా క్యూలో నిలబడి తమ సమస్యలను అధికారులకు తెలియజేశారు.

పోలీసుల బందోబస్తు
ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. క్యూలైన్లను క్రమబద్ధీకరిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించారు. దీంతో కార్యక్రమం ప్రశాంతంగా సాగింది. అధికారులు వినతులను స్వీకరించి సంబంధిత శాఖలకు పంపిస్తున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి వారం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం కార్యక్రమంపై ఉన్న విశ్వాసాన్ని సూచిస్తోంది.


