కాకతీయ, వరంగల్ : నిఖార్సైన తెలంగాణ బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి తోడు నిలుద్దామని, భారత ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఆత్మప్రబోధానుసారం ఓటు వేసి ఆయన్ను గెలిపిద్దామని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పరిచయ కార్యక్రమం సోమవారం హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగింది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి సురేఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఢిల్లీలో తెలుగు రాజకీయ నాయకుల హవా క్రమంగా తగ్గిపోతున్న తరుణంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉప రాష్ట్రపతి ఎన్నిక పోటీలో ఉండటం మన అందరికీ సంతోషకరమైన విషయమన్నారు.
భోగరాజు పట్టాభి సీతారామయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు, పుచ్చలపల్లి సుందరయ్య, నీలం సంజీవరెడ్డి, వి.వి గిరి, పీవీ నరసింహరావు, జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు, ఎన్టీ రామారావు తర్వాత మన తెలుగువారిని నిలుపుకోవాల్సిన బాధ్యత సాటి తెలుగు బిడ్డలుగా మన అందరిపై ఉన్నదని గుర్తు చేశారు. ప్రస్తుత మోడీ పాలనలో దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలన్నీ ప్రమాదంలో పడ్డాయన్నారు. అందుచేత రాజ్యాంగం మీద సంపూర్ణ అవగాహన, దాన్ని ఆకలింపు చేసుకున్న వ్యక్తినే ఇండియా కూటమి బరిలోకి దింపిందని చెప్పారు. భారత రాజ్యాంగం పరిరక్షించబడాలంటే ఉప రాష్ట్రపతిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలవాల్సిన అనివార్యమని అన్నారు.


