రైస్ మిల్లర్స్ సమస్యలు పరిష్కరిస్తాం
ధాన్యం కొనుగోలు, చెల్లింపులపై దృష్టి పెడుతాం
ములుగు జిల్లా కలెక్టర్ దివాకర
రైస్ మిల్లర్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ
కాకతీయ, ములుగు ప్రతినిధి : రైస్ మిల్లర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ దివాకర్ తెలిపారు.
ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ దివాకర్, అదనపు కలెక్టర్ మహేందర్ జి కలిసి తెలుగు పరాభవ నామ సంవత్సర డైరీని ఆవిష్కరించారు.
మిల్లర్ల సమస్యల ప్రస్తావన
కార్యక్రమం అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ జిల్లా కలెక్టర్‌ను కలిసి రైస్ మిల్లర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ధాన్యం కొనుగోలు, మిల్లింగ్ ప్రక్రియలో ఇబ్బందులు, చెల్లింపుల ఆలస్యం వంటి అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వం ఈ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కారం చూపాలని కోరారు.
మిల్లర్ల సమస్యలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. సమస్యలను సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంబంధిత శాఖలతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


