మూడు రోజుల్లో పన్ను వసూలు పూర్తి చేయాలి
ఆస్తిపన్నుపై కమీషనర్ కఠిన ఆదేశాలు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో 2025–26 ఆర్థిక సంవత్సరం ముగింపుకు కేవలం మూడు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉండటంతో ఆస్తిపన్ను వసూళ్లను శాతం వందకు పూర్తి చేయాలని కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. శనివారం కళాభారతి సమావేశ మందిరంలో రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, సానిటేషన్ విభాగాల అధికారులు, సిబ్బంది, వార్డు అధికారులతో జరిగిన సమీక్షలో రోజుకు సుమారు రూ.2.5 కోట్ల టార్గెట్‌తో వసూళ్లు జరపాలని స్పష్టం చేశారు. వసూళ్లలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరిస్తూ విధి నిర్వహణ సక్రమంగా లేకపోతే సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వార్డు అధికారులకు కేటాయించిన టార్గెట్‌లో కనీసం 95 శాతం పూర్తి చేయాలని స్పష్టం చేస్తూ ఫీల్డ్ లెవల్ సమస్యలను తెలుసుకుని పలు సూచనలు చేశారు. టాప్ 200 మొండి బకాయిదారులు, కమర్షియల్, మిక్స్డ్, డబుల్ నెంబర్ ప్రాపర్టీలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి అసెస్మెంట్‌ను ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు సందర్శించి పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. పన్నులు చెల్లించని ప్రాపర్టీలను చట్టప్రకారం సీజ్ చేయడంతో పాటు నీటి, విద్యుత్ కనెక్షన్లు తొలగించే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. డబుల్ నెంబర్ల ప్రాపర్టీలకు పాత, కొత్త నెంబర్లకు సంబంధించిన పన్నులు రెండూ వసూలు చేయాలని, రివిజన్ పిటిషన్లు తక్షణమే క్లియర్ చేయాలని, ఆర్‌ఆర్ యాక్ట్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. రెడ్ నోటీసులు జారీ చేసిన బకాయిదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తూ మూడు రోజుల గడువులో డిమాండ్ ప్రకారం వంద శాతం వసూళ్లు పూర్తి చేయాలని కమీషనర్ గట్టిగా ఆదేశించారు. సమావేశంలో డీసీలు ఖాధర్ మొహియుద్దీన్, వేణు మాధవ్ తదితర అధికారులు పాల్గొన్నారు.


