కాకతీయ, బయ్యారం: మండలంలో ఆదివారం రాత్రి నుండి ఎడతెరిపిలేని వర్షంతో ఏజెన్సీలోని వాగులు, వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. కోయగూడెం, సుద్దరేవు గ్రామాల సరిహద్దుల్లో మసివాగు ప్రమాదకరంగా ప్రవహిస్తుండడంతో కంబాలపల్లి- కోయగూడెం మధ్య రహదారి రాకపోకలు నిలిచిపోయాయి. పందిపంపుల వాగు ప్రమాదకరంగా ప్రవహించడంతో అల్లిగూడెం -కంబాలపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
నారాయణ పురం వద్ద మసి వాగు పొంగి ప్రవహిస్తుండటంతో ఇల్లందుకు వెళ్లే పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ నాగరాజ్ మాట్లాడుతూ ఆదివారం 76.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగిందని తెలిపారు. వాతావరణశాఖ సూచన మేరకు రాబోయే రెండు, మూడు రోజులు భారీ వర్షాలు రాబోతున్న తరుణంలో స్థానికుల ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని సూచించారు.


