హాస్టళ్లలో కట్టుదిట్టమైన పర్యవేక్షణ
వార్డెన్లు తప్పనిసరిగా హాజరు కావాలి
కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశాలు
కాకతీయ, పెద్దపల్లి : జిల్లాలోని సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో హాస్టల్ వార్డెన్లతో నిర్వహించిన సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు.
విద్యార్థులు భోజనం చేసే సమయం, సాయంత్రం స్టడీ అవర్స్ సమయంలో వార్డెన్లు తప్పనిసరిగా హాస్టళ్లలో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. హాస్టళ్లలోనే నివాసం ఉంటూ విద్యార్థులపై పర్యవేక్షణ పెంచాలని సూచించారు.
మార్చి నెలాఖరు లోపు హాస్టళ్లకు కేటాయించిన బడ్జెట్‌ను పూర్తిగా వినియోగించుకోవాలని ఆదేశించారు. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ముగిసే వరకు స్టడీ అవర్స్ నిర్వహించాలన్నారు. మిగిలిన తరగతుల విద్యార్థులకు కూడా ఏప్రిల్ 23 వరకు నిరంతరంగా స్టడీ అవర్స్ కొనసాగించాలని తెలిపారు.సమావేశంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి, ఏసీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్, హాస్టల్ వార్డెన్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


