7వ తేదీన కోడెల పంపిణీ
అందుబాటులో 300 కోడెలు
ఉమ్మడి కరీంనగర్, పరిసర జిల్లాల చిన్న, సన్నకారు రైతులు దరఖాస్తు చేసుకోవాలి
కలెక్టర్ గరిమ అగ్రవాల్
కాకతీయ సిరిసిల్ల టౌన్: ఏప్రిల్ 7వ తేదీన వేములవాడ పరిధి తిప్పాపూర్ లోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన తిప్పాపూర్ లోని గోశాలలో కోడెలను పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఒక ప్రకటనలో తెలిపారు. వేములవాడ తిప్పాపూర్ గోశాలలోని మధ్యస్థం నుంచి పెద్దగా ఉన్న 300 కోడెలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, పరిసర జిల్లాల రైతులు అర్హులని స్పష్టం చేశారు. కోడెల కోసం 1.5 నుంచి 5 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న సన్నకారు, చిన్నకారు రైతులు అర్హులని,వారు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన రైతులు పట్టాదారు పాస్ బుక్ తమ సమీప మండల వ్యవసాయ అధికారి/ ఏఈఓ నుంచి ధ్రువపత్రం, ఆధార్ కార్డ్ మొదలగు సంబంధిత ధ్రువ పత్రాలతో ఈ వెబ్సైట్ https://rajannasircilla.telangana.gov.in/ లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న రైతులు దానికి సంబంధించిన పత్రాలతో ఏప్రిల్ 7వ తేదీన మంగళవారం ఉదయం 07.00 గంటలకు వేములవాడ పరిధిలోని తిప్పాపూర్ గోశాలకు కోడెల కోసం రావాలని తెలిపారు. అర్హులైన రైతులకు మాత్రమే జియో ట్యాగింగ్ కలిగి ఉన్న కోడెలను పంపిణీ చేయనున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు.జియో ట్యాగింగ్ ఉన్న కోడెలు, వెబ్సైట్ లో రైతుల వివరాలు నమోదు చేయడంతో జీవాలు పక్కదారి పట్టే అవకాశం ఉండదని,భవిష్యత్తులో వాటి సంరక్షణను పరిశీలించవచ్చని స్పష్టం చేశారు.కోడెలను తీసుకువెళ్లే రైతులు వాటి సంరక్షణ బాధ్యతను సక్రమంగా పక్కాగా చూసుకోవాలని పక్కదారి పట్టినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గరిమ అగ్రవాల్ హెచ్చరించారు.


