కాకతీయ, వరంగల్ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చేతకావడం లేదని, దానికి ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూర్, దామెర, గీసుగొండ మండలాల సమన్వయ కమిటీ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. గ్రామాల వారీగా జరిగిన పార్టీ సమావేశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలకు చేస్తున్నారని, తప్పుడు కేసులు పెట్టే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేసి నిరాశ చెందుతున్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమయ్యేది కేవలం బీఆర్ఎస్ ద్వారానేనన్నారు. కార్యకర్తలందరూ కలిసికట్టుగా కృషి చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ కేతనం ఎగురవేయాలని పిలుపునిచ్చారు.


