మొలంగూర్ ఖిల్లాలో గుప్తనిధుల తవ్వకాలు
రాత్రివేళల్లో రహస్య తవ్వకాలు వెలుగులోకి
గుంతలతో బయటపడిన గుప్తనిధుల వేట
భద్రతా లోపం, అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
ఖిల్లా పరిరక్షణకు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్
కాకతీయ, శంకరపట్నం : శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలోని కాకతీయ కాలానికి చెందిన ప్రాచీన ఖిల్లా వద్ద గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం రాత్రివేళల్లో రహస్యంగా తవ్వకాలు నిర్వహించిన ఘటన వెలుగులోకి రావడంతో గ్రామంలో కలకలం రేగింది. గత కొన్ని రోజులుగా ఖిల్లా పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు గ్రామస్తులు గమనించినప్పటికీ పెద్దగా అనుమానం వ్యక్తం చేయలేదు. అయితే అదే వ్యక్తులు రాత్రి వేళల్లో ఎవరికి తెలియకుండా ప్రణాళికాబద్ధంగా తవ్వకాలు చేపట్టినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. శనివారం ఉదయం ఖిల్లా వద్దకు వెళ్లిన స్థానిక యువకులు పలు ప్రదేశాల్లో లోతైన గుంతలు తవ్వబడటం, మట్టిని పక్కకు కుప్పలు చేయడం గమనించారు. గుంతల తీరు పరిశీలిస్తే గుప్తనిధుల కోసం ఉద్దేశపూర్వకంగా తవ్వకాలు జరిపినట్లు తెలుస్తుండడంతో వెంటనే ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు తెలియజేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

నిర్లక్ష్యమే కారణం…పర్యవేక్షణ లోపం పై గ్రామస్తుల ఆగ్రహం..
ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడానికి ఖిల్లా వద్ద భద్రతా ఏర్పాట్లు లేకపోవడం రాత్రివేళల్లో పర్యవేక్షణ లేకపోవడమే కారణమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఖిల్లా పరిరక్షణపై అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ అధికారుల నుండి స్పందన లేదని గ్రామస్తులు తెలుపుతున్నారు. చారిత్రక కట్టడంపై ఇలాంటి తవ్వకాలు నిర్మాణాన్ని దెబ్బతీయడంతో పాటు విలువైన చారిత్రక ఆధారాలను నాశనం చేసే ప్రమాదం ఉందని, గుప్తనిధులపై ఉన్న అపోహలే కొందరిని ఇలాంటి అక్రమాలకు ప్రేరేపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.

పర్యటక కేంద్రంగా అభివృద్ది చేయాలి..
మొలంగూర్ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికులు చాలా కాలంగా కోరుతున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికుల నుండి తెలుస్తున్న సమాచారం. ఖిల్లా వద్ద మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు మోరే గణేష్ జిల్లా పాలనాధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. చారిత్రక వారసత్వాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


