మల్లూరు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి
ఆలయంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి
అభివృద్ధి పనులపై త్వరితగతిన నివేదికలు
ములుగు జిల్లా కలెక్టర్ టి.ఎస్ దివాకర
కాకతీయ, ఏటూరునాగారం : శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ వెంటనే సిద్ధం చేసి, భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ అన్నారు. ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామంలోని శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని గురువారం కలెక్టర్ సందర్శించారు. ఆలయ అభివృద్ధి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆలయానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారని తెలిపారు. వారి సౌకర్యార్థం అవసరమైన అన్ని వసతులను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రధాన ఆర్చి నిర్మాణం, రోడ్డు విస్తరణ, కళ్యాణ కట్ట, కళ్యాణ మండపం, పార్కింగ్ స్థలాల ఏర్పాటు వంటి పనులపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఆలయ ఆచార సంప్రదాయాలకు ఆటంకం కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఆర్కిటెక్ట్ బృందం, దేవాదాయ శాఖ డి ఈ రమేష్ బాబు, తాసిల్దార్ తోట రవీందర్, ఆలయ ఈవో మహేష్, ఎంపీడీవో బద్రు నాయక్, ఆలయ అర్చకులు, సంబంధిత అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


