ఒక్క ఫోన్ కాల్… ఒక నిండు ప్రాణం
ఆపదలో ‘ఆపద్భాందవుడు’… 108 సేవలతో విశ్వాసం
కాకతీయ, ఏటూరునాగారం : అత్యవసర సమయాల్లో ఒక్క ఫోన్ కాల్‌తో సకాలంలో చేరుకుని ప్రాణాలను కాపాడుతున్న 108 అంబులెన్స్ సేవలు ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచుకుంటున్నాయని అధికారులు తెలిపారు. ములుగు జిల్లాలో ప్రమాదాలు, అనారోగ్యం, ప్రసూతి వంటి పరిస్థితుల్లో 108 సేవలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇటీవల ఒక గ్రామంలో గుండె నొప్పితో కుప్పకూలిన వృద్ధురాలికి సమాచారం అందగానే అంబులెన్స్ చేరుకుని ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించింది. సమయానికి అందిన సేవలతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.
గణాంకాల్లో సేవల ప్రభావం
మార్చి 2025 నుంచి ఫిబ్రవరి 2026 వరకు జిల్లాలో 18,886 అత్యవసర కేసులను 108 ద్వారా నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు 1,569, గర్భిణీ కేసులు 2,461, అకస్మారక స్థితి 827, కడుపు నొప్పి 2,437, శ్వాసకోశ సమస్యలు 1,251 కేసులు నమోదు అయ్యాయి. మారుమూల గ్రామాల వరకు 108 సేవలు విస్తరించి, ఉచిత వైద్య సహాయం అందిస్తున్నాయి. గర్భిణీలు, వృద్ధులు, ప్రమాద బాధితులకు ఈ సేవలు జీవనాధారంగా మారాయి. ప్రజలు ఈ సేవలపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా 108,102 అత్యవసర సేవల ప్రోగ్రామ్ మేనేజర్ శివకుమార్, ములుగు జిల్లా మేనేజర్ రాజు కుమార్ ఈ వివరాలను వెల్లడించారు. 108 సిబ్బంది చేస్తున్న సేవలను ప్రజలు అభినందిస్తున్నారు.


