కాకతీయ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరి వల్లే కేసీఆర్ కు అవినీత మరక పడిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టుపై ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు ఆదేశాల నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాజీ మంత్రి హరీశ్ రావు, ఎంపీ సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేశారు.
ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తీసుకున్న నిర్ణయాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలని కోరారు. “ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రాజెక్టు ఎందుకు ఇలా దారుణ స్థితికి చేరిందో బయటపడాల్సిందే. దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరో ప్రజల ముందుకు రావాలి” అని ఆమె స్పష్టం చేశారు. ప్రత్యేకంగా హరీశ్ రావు, సంతోష్ రావుల పాత్రపై ప్రశ్నలు లేవనెత్తిన కవిత, “ఎవరైనా నిజాయితీగా ఉంటే విచారణకు భయపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రాజెక్టు వైఫల్యంపై సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది” అని వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ కలల సాకారం కావాల్సింది గానీ, నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలతో ఇప్పుడు సీబీఐ విచారణ దశకు చేరిందని ఆమె విమర్శించారు. ప్రజల డబ్బు వృథా అయిన ఈ ప్రాజెక్టుపై పూర్తి స్థాయి నిజం వెలుగులోకి రావాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ కలకలం రేగింది. రాబోయే రోజుల్లో హరీశ్ రావు, సంతోష్ రావులు ఎలా స్పందిస్తారో అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.


