వేద మంత్రోచ్ఛరణల నడుమ అంగరంగ వైభవంగా శ్రీరాముల వారి కల్యాణం..
కాకతీయ,శంకరపట్నం: మండల వ్యాప్తంగా శుక్రవారం రోజు శ్రీరామనవమి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కేశవపట్నం గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో శ్రీ సీతారాముల వారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం నుంచే ఆలయ పరిసరాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకోగా, పండితులు వేద మంత్రాల నడుమ సాంప్రదాయ పద్ధతుల్లో కల్యాణ వేడుకలను నిర్వహించారు. మంగళవాయిద్యాల నాదం మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మికంగా పరవశింపజేసింది. ఈ సందర్భంగా మహిళలు నిర్వహించిన కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, కార్యక్రమానికి మరింత శోభను తీసుకొచ్చాయి. చిన్నారులు, యువతులు సాంప్రదాయ వేషధారణలో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. అలాగే ఆలయంలో ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించగా, అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీరాముల వారి కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో తిలకించి తమ కోరికలు తీర్చుకోవాలని ప్రార్థించారు. ఆలయ ప్రాంగణం మొత్తం రామనామస్మరణతో మార్మోగాయి. ఈ కార్యక్రమంలో తణుకు ఓంకారం-బ్రదర్స్, గ్రామ సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్, ఉప సర్పంచ్ ఆకుబత్తిని విజయ్ కుమార్, వ్యాపారవేత్తలు,స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.



