“పన్నులు వంద శాతం వసూలు చేయాలి”
అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య
కాకతీయ, రామకృష్ణాపూర్ : మున్సిపల్ పరిధిలో పన్నులను వంద శాతం వసూలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. గురువారం స్థానిక క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. మున్సిపల్ అభివృద్ధి కొరకు పన్ను వసూలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని,పెండింగ్ బకాయిలను త్వరితగతిన వసూలు చేసే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ను ఆదేశించారు. పన్నుల వసూలు లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసే విధంగా అధికారులు నిత్యం పర్యవేక్షించాలని తెలిపారు. కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అదనపు కలెక్టర్ చంద్రయ్య అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అందించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికా కార్యక్రమాన్ని క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో పకడ్బందీగా అమలు చేయాలని, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.


