శ్రీరామనవమి ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు
భక్తులకు అసౌకర్యం లేకుండా ప్రత్యేక చర్యలు
ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి
మహేష్ బీ గీతే జిల్లా ఎస్పీ
కాకతీయ, సిరిసిల్ల టౌన్ : శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే తెలిపారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వేములవాడ రాజన్న క్షేత్రంలో నిర్వహించనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం నేపథ్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వేములవాడకు భారీగా వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 300 మంది పోలీస్ సిబ్బందిని విధుల్లో నియమించినట్లు తెలిపారు.
భక్తుల రద్దీపై అప్రమత్తం
ప్రతి అధికారి తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని సూచించారు. ఇన్‌చార్జ్ అధికారులు సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. భక్తులకు సులభంగా రాకపోకలు జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా శనివారం నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా రాజీ పడదగిన కేసులను గుర్తించి కౌన్సెలింగ్ ద్వారా పరిష్కారం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాస్, సీఐలు శ్రీనివాస్, వీరప్రసాద్, మొగిలి, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.


