డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు
22 మందికి జరిమానాలు : సీఐ శ్రీనివాస్
కాకతీయ, సిరిసిల్ల టౌన్ : సిరిసిల్ల పట్టణంలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 22 మంది పట్టుబడ్డారు.పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ జయశ్రీ వివిధ మొత్తాల్లో జరిమానాలు విధించారు.ముగ్గురికి రూ.1000 చొప్పున, ఇద్దరికి రూ.1500 చొప్పున, 10 మందికి రూ.2000 చొప్పున, ఒక్కరికి రూ.2500, ఐదుగురికి రూ.5000 చొప్పున, మరొకరికి రూ.7000 జరిమానా విధించినట్లు టౌన్ సీఐ శ్రీనివాస్ వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారందరికీ ట్రాఫిక్ ఎస్‌ఐ దిలీప్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.భవిష్యత్తులో మద్యం సేవించి వాహనాలు నడపబోమని వారితో ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ… పట్టణంలో ప్రతిరోజూ వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రైవ్స్ కొనసాగుతున్నాయని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి కేసులు భవిష్యత్తులో ఉద్యోగాలు, పోలీస్ వెరిఫికేషన్ సమయంలో ఇబ్బందులు కలిగించే అవకాశముందని స్పష్టం చేశారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించాలని సీఐ సూచించారు.


