ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కాంగ్రెస్ తీసుకోదు
డంపింగ్ యార్డ్ సమస్యపై ప్రభుత్వానికి నివేదిక
మంత్రులు, ఉన్నతాధికారులకు వివరాలు అందజేస్తాం
కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్
కాకతీయ, హుజురాబాద్ : డంపింగ్ యార్డ్ సమస్యలో ప్రజలకు నష్టం కలిగించే నిర్ణయాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోదని నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ స్పష్టం చేశారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన దీక్షలకు ఆయన సంఘీభావం తెలిపారు. దీక్షా శిబిరంలో పాల్గొని నిరసనకారులతో కలిసి కూర్చొన్నారు. డంపింగ్ యార్డ్ సమస్యను ఇప్పటికే మంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. చెత్త నిల్వల కారణంగా కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతున్నదని వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థాలతో సమస్య మరింత తీవ్రమవుతోందని అన్నారు.
శాశ్వత పరిష్కారానికి ప్రయత్నం
డంపింగ్ యార్డ్‌ను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ అంశంపై గతంలో చర్చలు జరిగినప్పటికీ అమలులోకి రాలేదని పేర్కొన్నారు. హుజురాబాద్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రిని త్వరలో కలిసి శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.


