వైన్స్‌లకు దేవుడి పేర్లు తీసేయండి
భగవంతుడి పేర్లు పెట్టకుండా చట్టాలు తీసుకురావాలి
లైసెన్సులు ఇచ్చే సమయంలోనే చర్యలు చేపట్టాలి
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
అసెంబ్లీలో బీజేపీ నేత సరికొత్త డిమాండ్
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు హాట్ హట్‌గా సాగుతున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సహా అనేక అంశాలపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటు చేసుకుంటోంది. ఈనేపథ్యంలోనే తాజాగా బీజేపీ నేత, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సరికొత్త డిమాండ్ చేశారు. వైన్స్‌లకు దేవుడి పేర్లు తీసేయాలని.. అదే సమయంలో దేవుడి పేర్లు పెట్టకుండా చట్టాలు తీసుకురావాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం షాపులకు దేవుని పేర్లను తీసేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ఇక నుంచి పెట్టే మద్యం షాపులకు కూడా దేవుడి పేర్లు పెట్టకుండా కొత్తగా చట్టాలు తీసుకురావాలని అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ.. రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేవుళ్ల పేర్లను మద్యం దుకాణాలకు పెట్టి.. హిందూ మతాన్ని తీవ్రంగా అవమానిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మద్యం దుకాణాలకు దేవుళ్ల పేర్లు పెట్టే వ్యవహారంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఇక నుంచి వైన్స్‌లకు లైసెన్సులు ఇచ్చే సమయంలోనే వాటికి దేవుళ్ల పేర్లను పెట్టకుండా చర్యలు చేపట్టాలని బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు.
దేవుడి పేర్లతోనే అనేకం..
మరోవైపు.. తెలంగాణ వ్యాప్తంగా వేల సంఖ్యలో మద్యం దుకాణాలు ఉండగా.. వాటిలో చాలా వైన్ షాపులకు దేవుడి పేర్లే ఉండటం గమనార్హం. సాధారణంగా దుర్గ వైన్స్, కనక దుర్గ వైన్స్, బాలాజీ వైన్స్, శ్రీ వేంకటేశ్వర వైన్స్, రేణుక ఎల్లమ్మ వైన్స్, మైసమ్మ తల్లి వైన్స్ అంటూ అనేక రకాల హిందూ దేవతల పేర్లను మద్యం దుకాణాలకు పెట్టుకుని నడిపిస్తున్నారు. అయితే మద్యం దుకాణాలకు హిందూ దేవుళ్ల పేర్లను పెట్టుకుంటే.. బాగా గిరాకీ వస్తుందని వారు భావిస్తూ ఉంటారు.


