9 లక్షల 45 వేల మందికి ఆరోగ్యశ్రీ..
ఏడాదికి 4 లక్షల మందికి ఉచిత సేవలు
ఇప్పటికీ రూ. 2400 కోట్లకుపైగా పేమెంట్స్
ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తమ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకూ 9 లక్షల 45 వేల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. గతంలో ఏడాదికి సగటున రెండున్న లక్షల మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందగా, ఇప్పుడు ఏడాదికి 4 లక్షల మంది ఆరోగ్యశ్రీని వినియోగించుకుంటున్నారని మంత్రి తెలిపారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ బకాయిలు, ఇతర అంశాలపై గురువారం అసెంబ్లీ క్వశన్ హవర్‌లో శాసన సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్‌కు సగటున నెలకు 52 కోట్లు చెల్లిస్తే, తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెలకు సగటున 89 కోట్లు చెల్లించామని మంత్రి తెలిపారు. 2023 డిసెంబర్ 8వ తేదీ నుంచి ఇప్పటి వరకు రూ. 2400 కోట్లకు రూపాయలకుపైగా పేమెంట్స్ చేశామన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఆరోగ్యశ్రీ కింద 600 కోట్లకుపైగా బకాయిలు ఉండగా, ఈహెచ్‌ఎస్ కింద మరో 130 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు. ఈ పాత బకాయిలను కూడా తగ్గిస్తూ వస్తున్నామని మంత్రి వివరించారు.
రూ. 250 కోట్ల వరకూ మాత్రమే బకాయిలు
ప్రస్తుతం ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ప్రైవేటు హాస్పిటళ్లకు సుమారు 250 కోట్ల వరకూ మాత్రమే బకాయిలు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. ప్రైవేటు, ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నింటికి రెగ్యులర్‌గా పేమెంట్స్ చేస్తామని, ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని మంత్రి తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలు అందించేందుకు ప్రైవేటు హాస్పిటళ్ల నిరాకరిస్తున్నాయని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలను మంత్రి ఖండించారు. ఆరోగ్యశ్రీలో చేరేందుకు ప్రైవేటు హాస్పిటళ్లు ఆసక్తి చూపిస్తున్నాయని, తాము అధికారంలోకి వచ్చినప్పటికి 330 ప్రైవేటు హాస్పిటళ్లలో మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలు అందగా, ఇప్పుడు ఆ సంఖ్య 537కు చేరిందని మంత్రి వెల్లడించారు. ములుగు, నారాయణపేట వంటి మారుమూల జిల్లాల్లోని హాస్పిటళ్లలో కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందేవిధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి వెల్లడించారు. ఆరోగ్యశ్రీ సేవల్లో పెరిగిన నాణ్యతను, రెగ్యులర్‌గా బకాయిలు విడుదల చేస్తున్నామన్న సత్యాన్ని ఎంప్యానల్‌మెంట్ కోసం పోటీపడుతున్న ప్రైవేటు హాస్పిటళ్ల సంఖ్య స్పష్టం చేస్తోందని మంత్రి వివరించారు.


