పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
కాకతీయ, చెన్నారావుపేట : చెన్నారావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది హాజరు నమోదు పుస్తకాలను పరిశీలించిన ఆమె, సిబ్బంది సమయపాలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలపై సమగ్రంగా సమీక్ష చేపట్టిన కలెక్టర్, రోగులకు అందుతున్న చికిత్స విధానం, సేవల నాణ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఔషధ నిల్వలను పరిశీలిస్తూ, అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం అస్సలు సహించబోమని హెచ్చరించిన ఆమె, శుభ్రత, పర్యవేక్షణ వ్యవస్థను కట్టుదిట్టం చేయాలని పేర్కొన్నారు. ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.


