రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి మృతి..
కాకతీయ, గీసుగొండ: రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందిన ఘటన గొర్రెకుంటలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, వరంగల్ మహానగర పాలక సంస్థ 15వ డివిజన్ గొర్రెకుంట గ్రామానికి చెందిన లాదెళ్ల ప్రవీణ్–సునీత దంపతులకు మింటూ, అక్షయ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నెల 25వ తేదీ బుధవారం ఉదయం అక్షయ్ తాగునీటి కోసం ఆటోలో వెళ్తుండగా గ్రామ సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అక్షయ్ తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే స్పందించి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం అక్షయ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.మృతుడు గొర్రెకుంట ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


