మేడారం గద్దెల వద్ద ప్రమాదం…
పూజారి కుమారుడికి తీవ్ర గాయాలు…
నిర్మాణాల నాణ్యతపై విమర్శలు…
ప్రభుత్వంపై రాజకీయ ఆరోపణలు….
కాకతీయ, ములుగు ప్రతినిధి: తెలంగాణలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద జరిగిన ప్రమాదం తీవ్ర చర్చనీయాంశమైంది. గద్దెల పరిసరాల్లో నిర్మించిన రాతి దిమ్మలు అకస్మాత్తుగా కూలిపోవడంతో సమ్మక్క ప్రధాన పూజారి కుటుంబానికి చెందిన బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమ్మక్క ప్రధాన పూజారి సిద్దబోయిన రానా రమేష్ కుమారుడు యువన్ (6) గద్దెల వద్ద ఆడుకుంటుండగా, అక్కడ ఏర్పాటు చేసిన రాతి దిమ్మలు ఒక్కసారిగా కూలిపోయాయి. ఈ ప్రమాదంలో బాలుడి కాలు రెండు చోట్ల విరిగినట్లు సమాచారం. అతనికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం వరంగల్‌కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలుడు చికిత్స పొందుతున్నాడు.


నాసిరకం పనులపై ఆరోపణలు…
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడారం వంటి ప్రముఖ ఆధ్యాత్మిక స్థలంలో నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిర్వహించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇటీవల నిర్మించిన రాతి కట్టడాలు బలహీనంగా ఉన్నాయని విమర్శలు
కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదని ఆరోపణలు
పర్యవేక్షణలో అధికారులు విఫలమయ్యారని స్థానికుల ఆవేదన
గాయపడిన బాలుడికి ప్రభుత్వం పూర్తి వైద్య ఖర్చులు భరించాలి-
బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు సిద్దబోయిన సురేందర్.
ప్రభుత్వ పనుల్లో నాణ్యతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, గాయపడిన బాలుడికి ప్రభుత్వం పూర్తి వైద్య ఖర్చులు భరించాలని డిమాండ్ చేశారు.
మేడారం పనులపై సిట్ విచారణ చేపట్టాలి-బీఆర్‌ఎస్ ములుగు జిల్లా నాయకుడు భూక్య జంపన్న.
ఈ ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని, వందేళ్ల కట్టడాలు అంటూ చెప్పిన నిర్మాణాలు వంద రోజులు కూడా నిలవలేదని, కాంట్రాక్టర్లకు పనులు వదిలేసి నాణ్యతను పట్టించుకోలేదని, భక్తుల ప్రాణాల కంటే కమిషన్లకే ప్రాధాన్యం ఇచ్చారని, మేడారం పనులపై సిట్ విచారణ చేపట్టాలి అని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి అని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని, సంబంధిత మంత్రులు నైతిక బాధ్యత వహించాలి అని డిమాండ్ చేశారు.
అధికారుల మౌనం.
ఈ ఘటనపై సంబంధిత శాఖల అధికారులు ఇంకా అధికారికంగా స్పందించకపోవడం గమనార్హం. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో ఈ ఘటన భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. చిన్నారి గాయపడిన ఈ సంఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


