“చెప్పినా స్పందనే లేదు”
చెత్తతో నిండిపోయిన మురుగు కాల్వలు
పోతిరెడ్డిపల్లిలో అధ్వానంగా పారిశుధ్యం
దోమల బెడదతో పెరుగుతున్న విషజ్వరాలు
తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్
కాకతీయ, చేర్యాల : చేర్యాల మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామం 8వ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. కాలువలు చెత్త చెదారంతో నిండిపోవడంతో మురుగు నీరు నిల్వ ఉండి, బయటకు వెళ్లకుండా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దీంతో దుర్వాసన వ్యాపించి పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. ఈ సమస్యను పలుమార్లు పంచాయతీ కార్యదర్శి, గ్రామ పంచాయతీ పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మురుగు నీరు నిల్వ ఉండటంతో దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రింబవళ్లు దోమల బెడద పెరిగి విషజ్వరాలు విజృంభిస్తున్నాయని, పలువురు ఆసుపత్రుల పాలవుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.



