గంటల్లోనే కిడ్నాప్ మిస్టరీ ఛేదన
సెల్వరాజును రక్షించిన పోలీసులు
వాకింగ్‌కు వెళ్లిన మాజీ సర్పంచ్ అపహరణ కలకలం
వ్యూహాత్మకంగా వ్యవహరించిన సీఐ మురళీ బృందం
సురక్షితంగా కుటుంబ సభ్యుల చెంతకు చేరిన బాధితుడు
కాకతీయ, ముదిగొండ : మండల పరిధిలోని పండ్రేగుపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్యదర్శి పాము సిల్వరాజు అపహరణ కలకలం రేపగా, పోలీసులు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి ఆయనను సురక్షితంగా రక్షించారు. బుధవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సిల్వరాజును గుర్తుతెలియని వ్యక్తులు కారు ఎక్కించుకొని తీసుకెళ్లినట్లు సమాచారం అందడంతో మండలవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన సీఐ వడ్డేపల్లి మురళీ తన బృందంతో వేగంగా చర్యలు చేపట్టారు. అపహరణకు సంబంధించిన ప్రతి అంశాన్ని సవివరంగా విశ్లేషించిన పోలీసులు తక్కువ సమయంలోనే నిందితుల ఆచూకీని గుర్తించారు. వ్యూహాత్మకంగా ఆపరేషన్ నిర్వహించి సిల్వరాజును సురక్షితంగా కాపాడి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. ఈ ఘటనతో ఉదయం నుంచి నెలకొన్న ఉద్రిక్తతకు ముగింపు పలికింది. పోలీసుల తక్షణ స్పందన, సమర్థవంతమైన దర్యాప్తు పట్ల మండల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. సీఐ మురళీ బృందం చురుకుదనం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


