విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
దిశా కమిటీ మెంబర్ గుజ్జునూరి బాబురావు
అన్నం ఉడకలేదని, రుచి సరిగాలేదని సిబ్బందిపై ఆగ్రహం
కాకతీయ, ఇనుగుర్తి :సాంఘిక సంక్షేమ పాఠశాలలో నెలకొన్న దారుణ పరిస్థితులపై దిశా కమిటీ మెంబర్ గుజ్జునూరి బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. బుధవారం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెస్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని గుర్తించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న అన్నం ముద్దలుగా ఉండడం గమనించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడారు. వంటశాలలో మెయిన్ కుక్ లేకపోవడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. పాత, కొత్త బియ్యాన్ని కలపడం వల్ల అన్నం నాణ్యత తగ్గుతోందన్నారు. విద్యార్థుల ఆరోగ్యంతో ఆడుకోవద్దని హెచ్చరించారు. వెంటనే అనుభవజ్ఞుడైన వంట మాస్టర్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రిన్సిపాల్ జయశ్రీ, వార్డెన్ ప్రతిరోజూ భోజన నాణ్యతను పరిశీలించాలని ఆదేశించారు. మార్పులు లేకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు సందీప్ పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, ఇతరులు హాజరయ్యారు.


