రోగులకు మెరుగైన సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యం
వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద బుధవారం నగరంలోని సీకేఎం ప్రసూతి ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్టర్ ఆసుపత్రిలోని వివిధ వార్డులను కలియతిరిగి, చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడారు. వారికి అందుతున్న సేవలు, సిబ్బంది తీరుపై ఆరా తీశారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెను స్వయంగా తెరిచి, అందులో బాధితులు రాసిన విన్నపాలను, సమస్యలను ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులకు పలు సూచనలు చేశారు. రోగులకు అందించే భోజనం నాణ్యతగా ఉండాలని, నిర్దేశించిన సమయానికి పౌష్టికాహారం అందేలా చూడాలని ఆదేశించారు. ఆసుపత్రి ప్రాంగణం, వార్డులు అత్యంత పరిశుభ్రంగా ఉండాలని స్పష్టం చేశారు. అవసరమైన ఔషధాల నిల్వలను పర్యవేక్షిస్తూ, రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. ఫిర్యాదు పెట్టెలో వచ్చిన సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
వైద్య సేవల్లో నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, రోగులకు మెరుగైన సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఉమారాణి, జిల్లా వెనుకబడిన వర్గాల అభివృద్ధి అధికారి పుష్పలత, సీకేఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ దేవి, ఎంజీఎం వైద్యాధికారి హరిచంద్ర రెడ్డి, ఇతర వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


