వైద్యం పేరుతో దోపిడీ
పెద్ద ఆస్పత్రులతో గ్రామీణ వైద్యుల లింకు
చిన్న వైద్యానికి పెద్ద ఆస్పత్రికి రెఫర్ చేస్తున్న ఆర్ఎంపీలు
పరీక్షల పేరుతో వేలల్లో ఫీజులు గుంజుతున్న ఆస్పత్రులు
కమీషన్లకు ఆశపడి రోగులను బలి చేస్తున్న గ్రామ వైద్యులు
ఆరోగ్య కాపాడుకోవాలనే భయంతో ఆర్థికంగా నష్టపోతున్న జనాలు
కాకతీయ, కరీంనగర్ : హుజూరాబాద్–జమ్మికుంట ప్రాంతాల్లో వైద్యం పేరుతో దోపిడీ బహిరంగంగా సాగుతోంది. గ్రామీణ ప్రజల అమాయకత్వాన్ని అడ్డంగా పెట్టుకుని ఆర్‌ఎంపీలు, ప్రైవేట్ ఆస్పత్రులు, మెడికల్ షాపులు కలిసి కమిషన్ గొలుసు నడుపుతున్నాయి. చిన్న అనారోగ్యాన్ని పెద్ద సమస్యగా చూపించి రోగులను పట్టణాలకు మళ్లించడం సాధారణంగా మారింది. గ్రామాల్లో జ్వరం, జలుబు వంటి సాధారణ సమస్యలకే మొదట ఇంజెక్షన్లు వేస్తారు. వెంటనే పరిస్థితి విషమమైందని చెబుతారు. కుటుంబ సభ్యులను భయపెడతారు. “ఇక్కడ చికిత్స కుదరదు” అంటూ పట్టణంలోని నిర్దిష్ట ఆస్పత్రులకు తీసుకెళ్తున్నారు. ఇదంతా ముందే ప్లాన్ ప్రకారం జరుగుతోంది.
చిన్నజబ్బుకు.. పెద్ద హాస్పిటల్‌కు రెఫర్
పేషెంట్‌ను తీసుకెళ్లేలోపే ఆస్పత్రులకు సమాచారం చేరుతుంది. ఆస్పత్రికి వెళ్లగానే నేరుగా డాక్టర్ వద్దకు తీసుకెళ్తారు. ఇతరులను పక్కనబెట్టి ముందుగా పరీక్షలు ప్రారంభిస్తారు. ఇది ఆర్‌ఎంపీలు, ఆస్పత్రుల మధ్య ఉన్న బలమైన లింకును స్పష్టం చేస్తోంది. ఆస్పత్రిలోకి వెళ్లిన తర్వాత అసలు దోపిడీ మొదలవుతోంది. చిన్న సమస్యకే భారీ చికిత్స అవసరమని చెబుతున్నారు. రోగులను, వారి కుటుంబాలను మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్నారు. డాక్టర్ల పేరుతో వరుసగా టెస్టులు రాస్తున్నారు. అవసరం లేకపోయినా స్కాన్లు, ల్యాబ్ పరీక్షలు చేస్తున్నారు. ఒక్కో పేషెంట్‌పై రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చు వేస్తున్నారు. ఈ మొత్తంలో పెద్ద భాగం కమిషన్లుగా తిరిగి ఆర్‌ఎంపీలకు చేరుతోంది. ప్రతి పేషెంట్ ఒక “డీల్”గా మారిపోయాడు. ఎంత ఖర్చు పెడితే అంత కమిషన్ అన్న లెక్కన వ్యవహారం నడుస్తోంది. మందుల విషయంలో కూడా ఇదే దందా కొనసాగుతోంది. నిర్దిష్ట మెడికల్ షాపులకే రోగులను పంపిస్తున్నారు. అక్కడ మందులను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒకే మందు ఒక చోట ఒక ధర, మరోచోట మరో ధర ఉండటం సాధారణమైపోయింది. “ఇక్కడే కొనాలి” అంటూ రోగులపై ఒత్తిడి తెస్తున్నారు. బయట కొనొద్దని స్పష్టం చేస్తున్నారు. ఇలా రోగిని పూర్తిగా ఒకే గొలుసులో బంధించి డబ్బులు గుంజుతున్నారు. ఈ వ్యవస్థలో బలైపోతున్నది పేద ప్రజలే. చిన్న జబ్బే పెద్ద అప్పుగా మారుతోంది. కుటుంబాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయి. ఆరోగ్యం కాపాడుకోవాలనే భయం దోపిడీకి ఆయుధంగా మారింది. ఈ పరిస్థితి కొనసాగుతుండగానే సంబంధిత శాఖల పర్యవేక్షణ కనిపించడం లేదు. నియంత్రణ లేకపోవడంతో ఈ దందా మరింత విస్తరిస్తోంది. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోకపోతే గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా దోపిడీ కేంద్రంగా మారే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.


